Tuesday, 16 November, 2010

ప్రకటన - మన తెలుగు బ్లాగర్ల రాతలతో e-బుక్ రూపకల్పన!

మనందరం బ్లాగుల్లో ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతుల గురించి రాసుకుంటాం. అప్పుడు ఆ సమయానికి అది కళ్ళబడిన వారు చదివి స్పందిస్తారు. మన రాతలని ఇష్టపడి మన బ్లాగుని అనుసరించేవారైతే మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉంది. కానీ, బ్లాగు మూసివేయబడటమో, లేక మరే ఇతర కారణాల వల్లనో మన రాతలు కొన్నాళ్ళకి మరుగున పడిపోక తప్పదు. అలా కాకుండా మన రాతల్ని పదిలపరిచి మరింతమంది కొత్త కొత్త పాఠకుల వద్దకి చేర్చగలిగే సౌకర్యం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా!

ఇప్పుడు మాకొచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రత్యేకంగా ఒక ఇతివృత్తాన్ని తీసుకుని, దానికి సంబంధించి వివిధ బ్లాగర్లు రాసిన వ్యాసాల్ని సేకరించి ఒక e-బుక్ గా తయారు చేస్తే బాగుంటుంది అని. ఆ రాతలు మనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు, మర్చిపోలేని సంతోషాలు, విషాదాలు, జ్ఞాపకాలు, సరదా సంఘటనలు.. ఇలా ఏవైనా అయ్యుండచ్చు. ఖచ్చితంగా నిజంగా జరిగినవే కాకపోయినా కథలో, కల్పితాలో, కవితలో కూడా అయ్యుండచ్చు. మనందరం రాసినవి ఏ రూపంలో ఉన్నా వాటన్నీటి ఇతివృత్తం మాత్రం ఒక్కటే అయ్యి ఉండాలి. అచ్చంగా అనేకమైన రంగురంగుల పువ్వులని చేర్చి ఒకటే దారంతో దండ గుచ్చిన మాదిరిగానన్నమాట! ;)

మన బ్లాగర్లందరూ ఎవరి శైలిలో వాళ్ళు రాస్తారు కాబట్టి, వీటన్నీటినీ ఒక చోట చేర్చితే తయారైన e-బుక్ మహా పసందుగా ఉంటుందని మాకనిపిస్తోంది. అంతే కాకుండా, అన్నీటినీ ఒక చోట కూర్చడం వల్ల చదివిన వాళ్ళకి కూడా ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఉచితంగా దొరికే ఈ పుస్తకాన్ని ఎవరమైనా సరే శాశ్వతంగా మన సొంత సేకరణలో భద్రపరుచుకోవచ్చు. మా ఈ బ్లాగుతో పాటు ఉచిత e-పుస్తకాలని పొందుపరిచే ఇతర వెబ్సైటులని కూడా సంప్రదించి వీలైనన్ని ఎక్కువ చోట్ల మన e-బుక్స్ అందుబాటులో ఉండేలా మేము ప్రయత్నిస్తాం. ఇది కేవలం బ్లాగుల మీద ఆసక్తితో తలపెట్టిన పనే గానీ మాకు మరేవిధమైన లాభాపేక్ష లేదని మనవి చేస్తున్నాం. :)మేము ఎంచుకున్న మొదటి ఇతివృత్తం - 'నూతన సంవత్సర ఆరంభం'

మా ఈ e-బుక్ ప్రయత్నంలో పాలుపంచుకోవాలనే వారికి సూచనలు:
-
మీరు వ్రాసేది పూర్తిగా తెలుగులో, యూనికోడులో ఉండాలి.
-
మీ రాతలు సొంత అనుభవమైనా, జ్ఞాపకమైనా, కవితైనా, ఊహలైనా, కల్పిత గాథైనా, కథైనా ఎలాంటి రూపంలోనైనా ఉండవచ్చు. కాకపోతే, అందులో ఇతివృత్తం మాత్రం 'నూతన సంవత్సరానికి' సంబంధించినది అయ్యి ఉండాలి.
-
మీరు పంపే వ్యాసం ఈ పాటికే మీ బ్లాగులో ప్రచురించినదైనా గానీ, ఒక వేళ మాకు పంపించాక మీరు మీ బ్లాగులో ప్రచురించుకోడానికి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదివరకే వేరే ఏదైనా వెబ్సైటు కోసమో, పత్రిక కోసమో రాసినదైతే మాత్రం దాన్ని తిరిగి ఇలా e-బుక్ లో పొందుపరచే విషయమై అవసరమైన అనుమతులు పొందవలసిన బాధ్యత, తద్వారా ఎదురయే ఎలాంటి పరిస్థితులకైనా పూర్తి భాద్యత మీదే!
-
మీరు రాతల పైన సర్వహక్కులూ మీవే!
-
మీ వ్యాసంతో పాటు మీ వివరాలు, బ్లాగు URL , ఈమెయిల్, ఫోటో తదితర వివరాలను కూడా పంపిస్తే వ్యాసంతో పాటుగా e-బుక్ లో పొందుపరుస్తాం. దీనివల్ల ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదించే వీలు ఉంటుంది.
-
ఈ పుస్తకాన్ని కూర్చే పని మేము తీసుకున్నాం కాబట్టి, వ్యాసాల్ని ఎంపిక చేసే పనిలో మాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని భావిస్తున్నాం!
-
మీ వ్యాసాలు మాకు పంపాల్సిన చిరునామా sujanamadhuram@gmail.com, మీ వ్యాసాలు మాకు అందాల్సిన ఆఖరు తేదీ డిసెంబరు 15, 2010.

మాకొచ్చిన ఈ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మీరందరూ సహకరిస్తారనీ, మా ఈ ప్రయత్నం విజయవంతమై ముందు ముందు మరిన్ని బ్లాగులకి సంబంధించిన e-బుక్స్ ని మనందరం కలిసి అందుబాటులోకి తీసుకురాగలగాలని ఆశిస్తూ..

ధన్యవాదాలతో,
సుజ్జీ & మధుర

16 comments:

RK said...

All the best!

ఏక లింగం said...

మంచి ప్రయత్నం. ఏదైనా సహాయం కావలసి వస్తే అందించడానికి సిద్ధం.

శరత్ 'కాలమ్' said...

ఒక విషయం కోసం ప్రత్యేకంగా బ్లాగు టపా వ్రాయాల్సివస్తే నాలాంటి వాడికయితే సహజత్వం, నాణ్యత తగ్గిపోతుంది. ఎందుకంటే ఓ గొప్పగా వుండాలని ప్రయత్నిస్తూ ఆ వంటకాన్ని చెడగొడతాం - మా ఆవిడ వంటల్లాగా. ఎప్పుడన్నా గొప్పగా వండాలని ప్రయత్నించిందనుకోండి - దాదాపుగా చెడిపోతుంది :)

బ్లాగులన్నవి ప్రత్యేకంగా వ్రాయడం కంటే ఆశువుగా వ్రాస్తేనే సహజంగా వుంటాయి. అంచేతా - నా సూచన ఏంటంటే మీకు నచ్చిన ఆంశంపై మీకు నచ్చిన బ్లాగుల్లో ఇప్పటికే వున్న టపాలను ఏరికోరి ప్రచురిస్తే బావుంటుంది. నాకయితే ఈబుక్స్ చదవడానికి బద్దకం. రమణి గారి బ్లాగులో వారి పాత రచనల ఈ బుక్ చదవాలని ఏణ్ణర్ధంగా అనుకుంటూనేవున్నాను. ఎప్పటి టపా అప్పుడే చదవడం ఇష్టం కానీ జనాలు అందరూ నాలాగే వుండరు కదా. మంచి ప్రయత్నం - కానివ్వండి మరి.

Anonymous said...

శరత్ గారితో ఏకీభవిస్తాను. ఎన్నోమంచి టపాలు ఇప్పటికే బ్లాగుల్లో ప్రకటించినవి ఉన్నాయి గదా! వాటిలోంచి ఒక అంశం ప్రాతిపదికగా కాకుండా నాణ్యతే ప్రమాణంగా ఎంచి కూర్చితే దాచుకోదగ్గ వైవిధ్యం గల పుస్తకం తయారవుతుంది.

సత్యప్రసాద్ అరిపిరాల said...

మీ ఆలోచన బాగుంది.
ఈ పుస్తకాల మాట సరే... ఇప్పటికే "వికాసధాత్రి" వారు అచ్చు పుస్తకమే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడండి:

http://blog.vikasadhatri.org/2010/11/blog-post.html

Anonymous said...

All the best

మధురవాణి said...

@ RK, అనానిమస్ 2,
ధన్యవాదాలండీ!

@ ఏకలింగం,
కృతజ్ఞతలు! సహాయం అవసరమైతే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తానండీ!

@ సత్యప్రసాద్ అరిపిరాల,
ధన్యవాదాలు. వికాసధాత్రి వారి ప్రయత్నం అభినందనీయం. మా e-బుక్ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి మరి! ;)

మధురవాణి said...

@ శరత్ 'కాలం', అనానిమస్ 1,
మీరు చెప్పిందాంట్లో కూడా నిజం లేకపోలేదు. ప్రత్యేకంగా మేము అడిగామని రాయడం అందరికీ నచ్చకపోవచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు. మీరన్నట్టు ఇదివరకే రాసినవాటిని ఎంపిక చేసుకోవచ్చు. అది దృష్టిలో ఉంచుకొనే ఈ క్రింది సూచన పెట్టాము.
**మీరు పంపే వ్యాసం ఈ పాటికే మీ బ్లాగులో ప్రచురించినదైనా గానీ పంపవచ్చు**
అలాగే, ఒకోసారి కొంతమంది రాద్దామనుకుని ఏదైనా కారణాల వాళ్ళ వాయిదా వేస్తున్నట్టయితే వారికి ఇలాంటి ప్రకటన కాస్తంత ఉత్సాహాన్ని కలిగించే అవకాశం కూడా లేకపోలేదు కదా!

అనానిమస్ గారన్నట్టు ఒక ప్రత్యేకమైన అంశం కాకుండా వివిధ రకాలైనవి కూర్చి ఓ పుస్తకం చేయడం అనే ఆలోచన కూడా మేము పరిగణించాము. ఉదాహరణకి అలాగా ఒక 10 e-బుక్స్ చేసాం అనుకుందాం. ఎవరైనా కొత్తగా చదవాలనుకునే వారికి ఎందులో ఎలాంటి విషయాలు ఉన్నాయో తెలియక ఆ బుక్స్ తిరగేయడం పెద్ద ఆసక్తికరంగా అనిపించకపోయే అవకాశం ఉంది. అదే ఏదైనా ఒక ఇతివృత్తం ఆధారంగా చేసినట్లైతే ఆ పుస్తకం లో ఏమి ఉండబోతోంది అనేదాని మీద చదవబోయే వారికి ఒక అవగాహన ఉంటుంది. పైగా, ఇతివృత్తం ఒకటే అయినా వేరువేరు బ్లాగర్లు రాయడం వలన శైలిలో వైవిధ్యం ఉంటుంది. అలా అనుకుని ఈ ప్రయత్నం ప్రారంభించాం. చూద్దాం ఎంతవరకు ఇది సఫలమౌతుందో!

శరత్ గారూ,
**బ్లాగులన్నవి ప్రత్యేకంగా వ్రాయడం కంటే ఆశువుగా వ్రాస్తేనే సహజంగా వుంటాయి.** మీరన్నది నిజమే!
అసలైతే, జనవరి 1 కల్లా e-బుక్ తయారైపోవాలని ముందనుకున్నాం. కానీ, కొత్త ఏడాది మొదలయే టైములో ఈ 'కొత్త సంవత్సారాగమనం' అనే అంశం మీద సహజంగానే చాలా మంది బ్లాగుల్లో రాసుకోవాలనుకుంటారు కదా! అలా రాసినవాటికి స్థానం కలిగించడం కోసం ఈ వ్యాసాల్ని సేకరించే సమయాన్ని జనవరి ఒకటో తేదీ దాటేదాకా పొడిగించవచ్చు. ఈ విషయం మరోసారి ఆలోచిస్తాం.

మీరన్నట్టు మేము తీసుకున్న ఈ ఇతివృత్తం గురించి ఇప్పటికే ఎన్నో మంచి టపాలు బ్లాగుల్లో వచ్చే ఉంటాయి. వాటిల్లో మా దృష్టికి వచ్చిన పోస్టుల కోసం మేము తప్పకుండా ఆయా బ్లాగర్లని సంప్రదిస్తాం. మీకేవైనా తెలిస్తే మాకు సమాచారం అందిస్తే చాలా సహాయంగా కూడా ఉంటుంది.
కానీ, ఈ మొత్తం కార్యక్రమానికి ఒక వేదికంటూ కావాలి కాబట్టి ఇక్కడ ఇలా ప్రకటించడం జరిగింది.

మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు బోలెడు ధన్యవాదాలు! ఇలాంటి చర్చల వల్లే కొత్త కోణాలు తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది.

Lakshmi Raghava said...

కంప్యుటర్ నాలేద్జే తక్కువగావున్న నాలాటి వారికి మీలా కొత్తవి ప్రయోగించే వాళ్ళంటే సరదా..నా బ్లాగులో మీకు ఏదైనా నచ్చితే చూడండి..
లక్ష్మీ రాఘవ

శిశిర said...

మంచి ప్రయత్నం. మీ ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆశిస్తున్నాను.

Seenu said...

@Saratkh "Kaalam"

శరత్ కాలం తో పూర్తిగా ఎకీభవిస్తున్నాను. ప్రత్యేకంగా టఫాలు వ్రాయటం అంటె కొద్దిగా అలోచించాల్సిందే

శ్రీలలిత said...

ఆలోచన బాగుంది. ఆచరణ కూడా ఇంతకంటే బాగుంటుందని ఆశిద్దాం..

'Padmarpita' said...

మీ ఆలోచన బాగుందండి...తప్పక ప్రయత్నిస్తాను!

మాలతి said...

బాగుంది - మంచి ఆలోచన. అభినందనలు మరియు శుభాకాంక్షలు

ఇందు said...

మధుర గారు.భలే ఉంది ఇదేంటో! నేను ట్రై చేస్తా!

karlapalem hanumantha rao said...

చక్కటి ఆలోచన ! అభినందిస్తున్నాను.కాకపోతే చిన్న ఆలోచన.
ఇంత శ్రమ పడే పని పెట్టుకుంటున్నారు కనక.
కాలక్షేపం కోసం ...రాసే రాతలు కాకుండా ..ఒక విషయం మీద చాలా లోతుగా ..మంచి అవగాహనతో ..రాసే ..బ్లాగర్లు మనకు వున్నారు..ఉదాహరణకు మాత్రమే చెపుతున్నాను (భండారు శ్రీనివాసరావు గారి వార్తా-వ్యాఖ్య ...వనం జ్వాలా నరసింహారావు గారి బ్లాగ్ లాంటివి)అలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు తాయారు చేయాలనుకునే ఈ-పుస్తకం పది కాలాలపాటు దాచుకునే రెఫెరెన్స్ గా కూడా వుపయోగపడుతుంది.తెలుగు భాష మీద చాలామంది ఎంతో అభిమానంతో టపాలు రాస్తున్నారు. వాటి మీద కూడా ఒక దృష్టి పెడితే మన భాషను గురించి మనమే చెప్పుకున్నట్లు వుంటుంది.(పర్ణశాల బ్లాగ్ లొ నేను చాలా మంచి టపాలు చూశాను.)