Sunday, March 18, 2012

కొన్ని చక్కటి తెలుగు బ్లాగులు - ఒక చిన్న పరిచయం

అందరికీ హలో.. హాయ్.. నమస్తే.. అందరూ బావున్నారా ? :)
చాలా చాలా రోజులైపోయింది కదూ 'సుజనమధురం' లో మిమ్మల్ని పలకరించి. మన తెలుగు బ్లాగులకి సంబంధించిన కబుర్లు, విశేషాలు చెప్పుకోడానికి ఒక చక్కటి వేదికగా ఉండాలని బ్లాగు ప్రారంభించిన సంగతి మీరందరికీ తెలిసిందే.. మళ్ళీ రోజు కాసిన్ని బ్లాగుల కబుర్లు చెప్పుకుందాం.

ఒక నాలుగేళ్ళ క్రితంతో పోల్చి చూస్తే ఇప్పుడు కొన్ని వందల తెలుగు బ్లాగులు కొత్తగా వచ్చి చేరాయి. మొత్తంగా ఇప్పుడు తెలుగు బ్లాగుల సంఖ్య వందల్లోంచి వేలలోకి ఎగబాకి ఉండొచ్చేమో.. అంచేత మనందరికీ అప్పుడప్పుడూ ఒకటీ అరా కొత్త బ్లాగులు పరిచయమవుతున్నా గానీ మొత్తం అన్నీ బ్లాగుల గురించీ అందరికీ తెలిసే అవకాశం లేదు. కాబట్టి మధ్య కాలంలో నాకు పరిచయమైన కొన్ని ఆసక్తికరమైన కొత్త బ్లాగులని పరిచయం చెయ్యదల్చుకున్నాను. కొన్ని కొన్ని బ్లాగులు అనతి కాలంలోనే అత్యధిక మంది చదువరుల అభిమానాన్ని చూరగొని దాదాపు అందరికీ పరిచయమైపోతుంటాయి. అలాంటి వాటి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం పెద్దగా లేదనుకుంటాను.
గత కొద్ది నెలల్లో నా కంటపడిన వాటిలో, కొద్దో గొప్పో నేను చదివిన వాటిలో నాకు ఆసక్తికరంగా అనిపించి, మరింతమంది దృష్టికి తీసుకురావాలనిపించిన కొన్ని బ్లాగులని క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. బ్లాగులన్నీటిలో నేను కూడా పూర్తిగా అన్నీ పోస్టులూ చదవలేదు. అయినా సరే, ఎప్పుడో అప్పుడు వీలు చూసుకుని తప్పకుండా చదువుతానని గట్టిగా అనుకున్నవే. :)

కష్టేఫలే

చిర్రావూరి భాస్కరశర్మ గారు 'శర్మ కాలక్షేపం కబుర్లు' అంటూ రాస్తోన్న బ్లాగు 'కష్టేఫలే'. జీవితంలో చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళి, పిల్లలు, మనవలూ అన్నీటినీ కలిపి పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన తాతగారు తన జీవిత కాలపు అనుభవాల్నీ, తన అనుభవాలు నేర్పిన పాఠాల్ని, తాను ప్రపంచాన్ని చదివి పెంపొందించుకున్న ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ రంగరించి చక్కగా హాయిగా ఎంత విన్నా ఇంకా ఇంకా వినబుద్ధయేలా చెప్పే కబుర్లే శర్మ గారి కాలేక్షపం కబుర్లు. మనకి ఇంట్లో ఒక తాతయ్య గారుండి రోజూ కాసేపు మన పక్కనే కూర్చుని కబుర్లు చెప్తే ఇంతే బావుంటుందేమో అనిపిస్తుంది. నాకు బ్లాగు చదివినప్పుడల్లా తాతగారు లేని లోతు తీరుతున్నట్టనిపిస్తుంది. నా ఉద్దేశ్యంలో అభిరుచులకి అతీతంగా తెలుగు బ్లాగులు చదివే ప్రతీ ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన బ్లాగు 'కష్టేఫలే'.

అనువాదలహరి

N.S
మూర్తి గారు నడుపుతున్న 'అనువాదలహరి' బ్లాగు ద్వారా మన తెలుగు బ్లాగర్లకి ప్రపంచ సాహిత్యలోకపు పరిచయ భాగ్యం కలుగుతోంది. ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ఎన్నెన్నో ఆంగ్ల కవితల్ని తెలుగులోకి, అలాగే చక్కటి తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తుంటారు మూర్తి గారు. పలు ప్రపంచ భాషల్లో పేరు మోసిన ప్రఖ్యాత కవులు, కవయిత్రుల్ని గురించి మనకి వివరంగా పరిచయం చేస్తూ, వారు రాసిన ఎన్నో అద్భుతమైన కవితల్ని తెలుగులోకి అందంగా, అర్థవంతంగా అనువదించడం మాత్రమే కాకుండా సాహిత్యంతో ఎక్కువ పరిచయం లేని మామూలు చదువరులకి కూడా ఆసక్తికరంగా, సులభతరంగా ఉండేలా రాయడం మూర్తి గారి ప్రత్యేకత. అంత సులువుగా, అలవోకగా, మంచినీళ్ళ ప్రాయంగా అందమైన అనువాదాలు చేసేస్తోన్న మూర్తి గారి భాషా పటిమనీ, సాహిత్య సేవనీ చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది నాకు. సాహిత్యాభిలాష, కవిత్వ పఠనాసక్తి ఉన్న వారందరూ తప్పకుండా చూడవలసిన బ్లాగు 'అనువాదలహరి'. 'గడ్డిపూలు' సుజాత గారి మాటల్లో అనువాదలహరి బ్లాగు గురించిన పరిచయం ఇక్కడ చూడొచ్చు.

శర్కరి

జ్యోతిర్మయి గారు రాసే బ్లాగు పేరు చూసేదాకా 'శర్కరి' అనే పదానికి చక్కెరతో పాటుగా అక్షరమాల అనే అర్థం ఉందని నాకు తెలీదు. మొదటి చూపులోనే నన్ను ఎంతగానో ఆకట్టుకున్న బ్లాగు ఇది. జ్యోతిర్మయి గారు చెప్పే తన జ్ఞాపకాల కబుర్లూ, వాళ్ళ పిల్లల కబుర్లు, ఇంట్లో ముచ్చట్లు, అమెరికాలో తను నడిపే బుల్లి తెలుగు పాఠశాల విశేషాలు, మధ్య మధ్యనా చక్కటి కవితలు, అప్పుడప్పుడూ కథలూ.. మొత్తంగా జ్యోతిర్మయి గారి 'శర్కరి' ని ఒక చక్కటి ఆహ్లాదకరమైన తెలుగు బ్లాగని చెప్పుకోవచ్చు. బ్లాగులో ఒకటీ రెండు టపాలు చదివి చూస్తే మీరే వరసబెట్టి మిగతావన్నీ చదివేద్దాం అనుకుంటారు. అంతగా చదివించే గుణం ఉంది జ్యోతిర్మయి గారి టపాలకి.

చిన్నిఆశ
నేను తరచూ చూస్తుండే బ్లాగుల్లో 'చిన్నిఆశ' ఒకటి. అనగనగా చిట్టి, పండు అనే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చక్కటి జంట ఇద్దరూ కలిసి ముచ్చటగా రాసుకుంటూ ఉంటారు. చిట్టేమో అలవోకగా అందమైన కవితలు అల్లేస్తుంటుంది. పండు చక్కటి వర్ణచిత్రాలు గీసేస్తుంటారు. ఇద్దరూ కలిసి బోలెడు కబుర్లు చెప్తుంటారు. వీరిద్దరి రాతల్లో, గీతల్లో.. ప్రకృతి, ప్రేమ, అనుబంధం, ఆరాధన, విజయం, విరహం, ప్రేమలేఖలూ, జ్ఞాపకాలూ ఇలాంటి బోలెడు హృద్యమైన అంశాలు చోటు చేసుకుంటాయి. అలతి అలతి పదాలతో రాసే కవితలన్నా, చిత్రలేఖనం అన్నా ఇష్టపడేవారు తప్పనిసరిగా చూడాల్సిన బ్లాగు చిన్నిఆశ.

నవ రస(జ్ఞ) భరితం

రసజ్ఞ గారు రాస్తోన్న బ్లాగు పేరుకి తగ్గట్టే నవరసభరితంగా ఉంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాల గురించి విరివిగా, కూలంకషంగా చర్చించే రసజ్ఞ గారికున్న విషయ పరిజ్ఞానం, ఎంచుకునే అంశాలు చూసాక తనని ప్రశంసించకుండా ఉండలేము. స్నానం, గోరింటాకు, శంఖువు, కర్పూరం, చెప్పులు, గాజులు, కస్తూరి.. ఇలా విషయం తీసుకున్నా పురాణాల కాలం నాటి విశేషాల నుంచీ సవివరంగా పరిశోధనాపత్రం రాసినంత పద్దతిగా వివరణాత్మకంగా రాయడం రసజ్ఞ గారి ప్రత్యేకత. తెలుగువారి పండగల గురించి ఎన్నో విశేషాలని సవివరంగా చెప్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంస్కృతీ, సంప్రదాయాలంటే ఆసక్తి ఉన్నవారు, ఒక అచ్చతెలుగు బ్లాగు చూడాలనుకునేవారు తప్పక చూడాల్సిన బ్లాగు నవరసజ్ఞభరితం.

వనజ వనమాలి

మొదటిసారి బ్లాగు చూడగానే టక్కున ఆగిపోయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వనజ గారి ప్రొఫైల్ ఫోటో చూసి భలే బావుందే అని ముచ్చటపడ్డాను. వనజ గారి బ్లాగులో కవితలూ, కబుర్లతో పాటు బోలెడు పాటల గురించిన టపాలు కూడా ఉన్నాయి. వనజ గారి రాతలు నేనింకా ఎక్కువ చదవలేదు గానీ చూసిన కొంతలోనే బ్లాగులో ఆలోచింపజేసే రాతలు చాలానే ఉన్నాయనిపించింది నాకు. వీలు చూసుకుని తప్పక చదవాల్సిన బ్లాగని నా నమ్మకం.

నిరంతరమూ వసంతములే..
సురేష్ పెద్దరాజు గారు 'ఎంతో మధురమీ స్నేహం' అనే పేరుతో నవలని సీరియల్ రూపంలో రాస్తున్న బ్లాగు పేరు 'నిరంతరమూ వసంతములే'. వైజాగ్ గీతం ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్న ముగ్గురు యువకుల స్నేహం, వాళ్ళ వాళ్ళ ప్రేమకథలూ, స్నేహితుల మధ్యన అపార్థాలూ, మళ్ళీ కలిసిపోడాలూ.. తదితర అంశాలని స్పృశిస్తూ సాగే ధారావాహిక ఇప్పటికి ముప్ఫై భాగాలని పూర్తి చేసుకుంది. ధారావాహికలు చదివే ఆసక్తి ఉన్నవారు బ్లాగుని దర్శించవచ్చు.

కడలి
సుభాషిణి గారు 'కలలు అలలైతే' అంటూ రాస్తోన్న బ్లాగు 'కడలి'. బ్లాగులో బోలెదాన్ని చక్కటి కవితలతో పాటు తను స్వయంగా గీసుకున్న బొమ్మల్ని కూడా చూడొచ్చు.సుభాషిణి గారి గురించి నాకు ప్రత్యేకంగా నచ్చే విషయం ఏంటంటే, ఆవిడ తన బ్లాగులో కన్నా వేరే అందరి పోస్టులూ చదివి, ఓపిగ్గా స్పందిస్తూ, తోటి బ్లాగర్లని ప్రోత్సహిస్తూనే ఎక్కువ కనిపిస్తుంటారు. వారి స్నేహశీలత నన్ను చాలా ఆకట్టుకుంటుంది.

అమాయకపు భర్త

అమాయకపు భర్త గారు ఇప్పటి దాకా కొద్ది పోస్టులే రాసారు గానీ ఆయనలోని అమాయకత్వాన్ని, వారి శ్రీమతి గారితో సరాగాల్ని చాలా సరదాగా రాస్తుంటారు. హాయిగా నవ్వించే బ్లాగు ఇది.

తెలుగు బ్లాగు సీ'రియల్ ముచ్చట్లు'

ఇది లాస్య రామకృష్ణ గారు రాస్తోన్న బ్లాగు. తను సరదాగా చెప్పే జ్ఞాపకాల కబుర్లతో పాటుగా, పాటల గురించీ, వంటల గురించీ రాస్తుండే ముచ్చటైన ఇల్లాలి బ్లాగు.


ఇవే కాకుండా నాకు తెలియనివి కూడా ఇంకా బోల్డు బ్లాగులు ఉండి ఉండొచ్చు. తెలిసినవారు పోస్టులో కామెంట్లు రాసి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికరమైన కొత్త బ్లాగుల్ని సూచించవచ్చు. నాకే కాకుండా మరింతమందికి వాటి గురించి తెలుస్తుంది.