Tuesday, 16 November, 2010

ప్రకటన - మన తెలుగు బ్లాగర్ల రాతలతో e-బుక్ రూపకల్పన!

మనందరం బ్లాగుల్లో ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతుల గురించి రాసుకుంటాం. అప్పుడు ఆ సమయానికి అది కళ్ళబడిన వారు చదివి స్పందిస్తారు. మన రాతలని ఇష్టపడి మన బ్లాగుని అనుసరించేవారైతే మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉంది. కానీ, బ్లాగు మూసివేయబడటమో, లేక మరే ఇతర కారణాల వల్లనో మన రాతలు కొన్నాళ్ళకి మరుగున పడిపోక తప్పదు. అలా కాకుండా మన రాతల్ని పదిలపరిచి మరింతమంది కొత్త కొత్త పాఠకుల వద్దకి చేర్చగలిగే సౌకర్యం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా!

ఇప్పుడు మాకొచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రత్యేకంగా ఒక ఇతివృత్తాన్ని తీసుకుని, దానికి సంబంధించి వివిధ బ్లాగర్లు రాసిన వ్యాసాల్ని సేకరించి ఒక e-బుక్ గా తయారు చేస్తే బాగుంటుంది అని. ఆ రాతలు మనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు, మర్చిపోలేని సంతోషాలు, విషాదాలు, జ్ఞాపకాలు, సరదా సంఘటనలు.. ఇలా ఏవైనా అయ్యుండచ్చు. ఖచ్చితంగా నిజంగా జరిగినవే కాకపోయినా కథలో, కల్పితాలో, కవితలో కూడా అయ్యుండచ్చు. మనందరం రాసినవి ఏ రూపంలో ఉన్నా వాటన్నీటి ఇతివృత్తం మాత్రం ఒక్కటే అయ్యి ఉండాలి. అచ్చంగా అనేకమైన రంగురంగుల పువ్వులని చేర్చి ఒకటే దారంతో దండ గుచ్చిన మాదిరిగానన్నమాట! ;)

మన బ్లాగర్లందరూ ఎవరి శైలిలో వాళ్ళు రాస్తారు కాబట్టి, వీటన్నీటినీ ఒక చోట చేర్చితే తయారైన e-బుక్ మహా పసందుగా ఉంటుందని మాకనిపిస్తోంది. అంతే కాకుండా, అన్నీటినీ ఒక చోట కూర్చడం వల్ల చదివిన వాళ్ళకి కూడా ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఉచితంగా దొరికే ఈ పుస్తకాన్ని ఎవరమైనా సరే శాశ్వతంగా మన సొంత సేకరణలో భద్రపరుచుకోవచ్చు. మా ఈ బ్లాగుతో పాటు ఉచిత e-పుస్తకాలని పొందుపరిచే ఇతర వెబ్సైటులని కూడా సంప్రదించి వీలైనన్ని ఎక్కువ చోట్ల మన e-బుక్స్ అందుబాటులో ఉండేలా మేము ప్రయత్నిస్తాం. ఇది కేవలం బ్లాగుల మీద ఆసక్తితో తలపెట్టిన పనే గానీ మాకు మరేవిధమైన లాభాపేక్ష లేదని మనవి చేస్తున్నాం. :)మేము ఎంచుకున్న మొదటి ఇతివృత్తం - 'నూతన సంవత్సర ఆరంభం'

మా ఈ e-బుక్ ప్రయత్నంలో పాలుపంచుకోవాలనే వారికి సూచనలు:
-
మీరు వ్రాసేది పూర్తిగా తెలుగులో, యూనికోడులో ఉండాలి.
-
మీ రాతలు సొంత అనుభవమైనా, జ్ఞాపకమైనా, కవితైనా, ఊహలైనా, కల్పిత గాథైనా, కథైనా ఎలాంటి రూపంలోనైనా ఉండవచ్చు. కాకపోతే, అందులో ఇతివృత్తం మాత్రం 'నూతన సంవత్సరానికి' సంబంధించినది అయ్యి ఉండాలి.
-
మీరు పంపే వ్యాసం ఈ పాటికే మీ బ్లాగులో ప్రచురించినదైనా గానీ, ఒక వేళ మాకు పంపించాక మీరు మీ బ్లాగులో ప్రచురించుకోడానికి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదివరకే వేరే ఏదైనా వెబ్సైటు కోసమో, పత్రిక కోసమో రాసినదైతే మాత్రం దాన్ని తిరిగి ఇలా e-బుక్ లో పొందుపరచే విషయమై అవసరమైన అనుమతులు పొందవలసిన బాధ్యత, తద్వారా ఎదురయే ఎలాంటి పరిస్థితులకైనా పూర్తి భాద్యత మీదే!
-
మీరు రాతల పైన సర్వహక్కులూ మీవే!
-
మీ వ్యాసంతో పాటు మీ వివరాలు, బ్లాగు URL , ఈమెయిల్, ఫోటో తదితర వివరాలను కూడా పంపిస్తే వ్యాసంతో పాటుగా e-బుక్ లో పొందుపరుస్తాం. దీనివల్ల ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదించే వీలు ఉంటుంది.
-
ఈ పుస్తకాన్ని కూర్చే పని మేము తీసుకున్నాం కాబట్టి, వ్యాసాల్ని ఎంపిక చేసే పనిలో మాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని భావిస్తున్నాం!
-
మీ వ్యాసాలు మాకు పంపాల్సిన చిరునామా sujanamadhuram@gmail.com, మీ వ్యాసాలు మాకు అందాల్సిన ఆఖరు తేదీ డిసెంబరు 15, 2010.

మాకొచ్చిన ఈ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మీరందరూ సహకరిస్తారనీ, మా ఈ ప్రయత్నం విజయవంతమై ముందు ముందు మరిన్ని బ్లాగులకి సంబంధించిన e-బుక్స్ ని మనందరం కలిసి అందుబాటులోకి తీసుకురాగలగాలని ఆశిస్తూ..

ధన్యవాదాలతో,
సుజ్జీ & మధుర