Monday, March 8, 2010

'బ్లాగ్స్పందన'... అంటే.!?

పుస్తకాలూ, పాటలూ, సినిమాలూ.... ఇవన్నీ ఒక్కొక్కరికీ ఒక్కో అనుభూతిని మిగులుస్తాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే కదా! అయితే, నాకూ, సుజ్జీకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. బ్లాగుల్లో పోస్టులు కూడా అంతే కదా! అని. అనుకుందే తడవుగా, యీ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టేశాం :-) అదే 'బ్లాగ్స్పందన'. అంటే, ఫలానా బ్లాగులో ఫలానా పోస్టు చదివినప్పుడు నాకిలా అనిపించింది, నాకీ విధమైన అనుభూతి, ఆలోచనా కలిగింది అని మన 'సుజనమధురం' లో చెప్పడం అన్నమాట!

దీని వల్ల ఏంటీ లాభం అంటే... ఒకటి మాకు నచ్చిన పోస్టు మరికొంతమందికి పరిచయం అవుతుంది. ఇంతదాకా చూడనివాళ్ళకి చూసే అవకాశం కలుగుతుంది. ఇంకోటి, పోస్టుపైన వేరే విధమైన అభిప్రాయాలుంటే, ఒక మంచి చర్చ అవుతుంది. ఆ పోస్టు రాసిన సదరు బ్లాగరుకి కూడా తను రాసినదానికి చదువరులు ఎలా స్పందిస్తున్నారో తెలుస్తుంది. ఇది మాములుగా వ్యాఖ్యల రూపంలో కూడా తెలుస్తుందనుకోండి. కానీ, ఏదయినా మనల్ని చాలా చాలా ఆనందింపజేస్తే, లేదా ఆలోచింపజేస్తే దాని గురించి వివరంగా స్పందిస్తే బాగుంటుంది కదా! పైగా, 'సుజనమధురం' ఇప్పుడిప్పుడే బ్లాగ్లోకం చుట్టూ అల్లుకుంటున్న పూలతీగ లాంటిది కదా! (పోలిక బాగుందా ;-) అందుకే 'బ్లాగ్స్పందన' శీర్షికన అప్పుడప్పుడూ ఇలా స్పందించే కార్యక్రమం మొదలెట్టబోతున్నాం.

ఇందులో భాగంగా మొదటి పోస్టు నేనొక్కదాన్నే రాస్తా అన్నాను సుజ్జీతో.! సరే.. అంది సుజ్జీ విషయం తెలీక. మా ఇద్దరి మధ్యా ఇంత చక్కటి స్నేహబంధం ఏర్పడడంలో తన కవితల పాత్ర విస్మరించలేనిది. కాబట్టి, సుజ్జీ కవితలను గురించిన నా స్పందనే 'బ్లాగ్స్పందన' లో మొదటి టపా! అంటే, సుజ్జీకి చిన్న సర్ప్రైజ్ లాంటిదన్న మాట! ;-)

*******************************************


మనిషి మనసు ఎంత చిత్రమైంది కదా.! ఓ పట్టాన అర్ధం చేసుకోలేం.. అది మనదైనా..మరొకరిదైనా.! మనసులో ఉప్పొంగే భావాలు ఎన్నెన్నని చెప్పగలం.!? ఎన్నెన్ని ఉన్నా, ప్రతీ క్షణం కొత్తకొత్తగా మళ్ళీ బోలెడన్ని వచ్చి చేరుతూనే ఉంటాయి. ఎన్ని వచ్చి చేరినా ఎప్పటికీ నిండిపోదు.. పుష్పక విమానంలా! :-) ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం, అలక, సందేహం, జ్ఞాపకం, నిరాశ, దుఃఖం, బాధ, వేదన.. ఇలా మదిలో జనించే భావాలెన్నో... ఎన్నెన్నో మన హృదయసాగర మథనంలో! ఒకొక్కప్పుడు మన మదిలోని భావసంక్లిష్టత ఎలా ఉంటుందంటే, ఎంత ప్రయత్నించినా ఆ భావాన్ని మాటల్లో పేర్చలేము. మన మదిలో గడ్డకట్టుకుని ఉన్న లోతైన భావాన్ని బోలెడన్ని వాక్యాల్లో నింపకుండా కేవలం చిన్న చిన్న పదాల అల్లికలో నింపి చెప్పగలమా? ఒకవేళ ఎవరైనా అలా చెప్పగలిగితే మాత్రం.. అది అలాంటి భావ వ్యక్తీకరణ చేయగల వ్యక్తి ప్రత్యేకతే అంటాను నేనయితే. అలాంటి ప్రత్యేకతే నాకు సుజ్జీ రాసే బుల్లి బుల్లి కవితల్లో కనిపించింది. గట్టిగా నాలుగు వాక్యాలు కూడా లేని చిట్టి పొట్టి రాతల్లో, సాదాసీదా పదాల్లో.. ఇంత చిక్కనైన భావం ఎలా నింపిందా.!? అని సుజ్జీ కవితలు చదివిన ప్రతీసారీ నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను.

తన కవితలు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు కూడా మొదటిసారిలానే మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యంలో మునిగితేలుతూనే ఉంటా.! నన్నింతలా అబ్బురపరుస్తున్న తన కవితాపుష్పాలకి నా మనఃస్పందనని కాసిన్ని మాటల్లో కూర్చి చెప్పే చిన్న ప్రయత్నం చేస్తున్నా.!

*********************************************

నీ కోసం ఏరుకొచ్చిన మల్లె లన్నీ
నీ ఊసులతో మాల అల్లాను!
రోజంతా ఎదురు చూసి చూసి....
పువ్వులన్నీ చిన్నబోయాయి..!
మనసంతా అల్లుకున్న నీ తలపులతో, నా
కనులు బరువెక్కి వాలిపొయాయి..!

'నీ కోసం' అనే యీ చిన్నికవితలో బోలెడంత విరహం ఒలికిపోతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. నీకోసం ఏరుకొచ్చిన మల్లెల్ని నీ ఊసులతో మాల అల్లానని మురిపెంగా చెప్పడం ఎంత ప్రియమైన భావన కదూ!? ఇంతలోనే చిన్నపాటి ఆశాభంగం.. తన దర్శనభాగ్యం కలగలేదని. తానే కాదు తాను తెచ్చిన మల్లెలు కూడా ఎదురు చూసీ చూసీ చివరకు ప్రియసఖుడి మీద కినుక వహించి తమ మోము చిన్నబుచ్చుకున్నాయట.! అంతలోనే, మళ్ళీ విరహం.. మనస్సంతా అల్లుకున్న ప్రియుని తీయని తలపులతో, కనుపాపలు బరువెక్కి సోలిపోయాయట. ఎంతందంగా ఉంది కదూ!!

**********************************


మనకి ఏదైనా సంతోషం వస్తే అది వ్యక్తపరచడం, పంచుకోవడం చాలా తేలిక. అది మనకి మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది కూడానూ.! కానీ, మన మనసుకి ఏదయినా బాధ కలిగితే, దాన్ని వ్యక్తపరచడం చాలా కష్టం. ఎలా చెప్పినా, ఎంత చెప్పినా మనలో ఉన్న వేదనంతా మాటల్లో నింపగలిగామా అంటే సందేహమే.!! కానీ, సుజ్జీ చేతిలో మాత్రం యీ చిన్ని చిన్ని కవితలు కొండంత భావాన్ని తమలో ఇముడ్చుకుని ముచ్చటగా ముస్తాబౌతాయి. ఎలాగో మీరూ చూడండి ఓసారి! :-)


ఒకోసారి చుట్టూ చూస్తున్న ప్రపంచానికీ, మనకీ ఈ సంబంధమూ లేదేమోనన్నట్టు, అసలేం పట్టనట్టు, నిరాసక్తంగా, నిర్వేదంగా అనిపిస్తుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచంలో నాకు సంబంధించినదేదీ లేదనేంత ఒంటరితనంగా అనిపిస్తుంది. మది నిండా బాధ, వేదన, అయోమయం గూడు కట్టుకున్నట్టవుతుంది. మనసుకి నచ్చింది దూరమైతే కలిగే మనఃక్లేశం, అలాగే తన మనసు కోరుకుంటోంది ఎంతటి అసాధ్యమో, తను చేస్తోంది ఎంత విఫల ప్రయత్నమో చెప్పడానికి ఇంతకంటే సరైన మాటలు దొరుకుతాయా.?


నాది కాని లోకంలో

ఏ మనిషిని వెతకను..??

నీళ్ళు లేని సంద్రంలో

ఏ నావను నడపను..!!??

**************************************


ఎన్నెన్నో అందమైన ఊహలతో, కోటి ఆశలతో ఒక అందమైన భవిష్యత్తుని ఊహల్లో చిత్రించుకుంది ఓ మనసు. తన మదిలో అల్లుకున్న జీవన చిత్రానికి మరో అందమైన మనసు తోడై సరికొత్త వర్ణాలు అద్దుతుందని మురిసిపోయింది. ఇంతలోనే, అందుకు భిన్నంగా తనూహించిన అందమైన మనసు వికృతరూపం దాల్చి తన కలలన్నీ కల్లలు చేస్తూ, ఆశలన్నీ ఆవిరి చేస్తూ ఉన్నపళంగా తనని దుఖసాగరంలో ముంచేస్తే ఆ ఆశాభంగం ఎలా ఉంటుందో ఊహించండి. ఎంత వేదన కదూ!? అంతటి ఆశాభంగాన్ని కేవలం ఇంత చిన్న వాక్యాల్లోనే నింపేయగలగడం చూస్తోంటే అబ్బురమనిపిస్తోంది కదూ!!

యుగాలుగా ఒంటరిగా ఉన్న నేను
నిజాయితీగా నా హృదయం పరిచాను..!
నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
నా కళ్ళల్లో కన్నీరై మిగిలావు... !!


సుజ్జీ కవితలు చదివాక, కేవలం అందమైన జ్ఞాపకాలు, ఊసులే కాదు, వేదన నింపిన పలుకులు కూడా ఇంతందంగా ఉంటాయా అని నాలాగా మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదూ!!?

15 comments:

Srujana Ramanujan said...

:D

పరిమళం said...

అవునండీ నిజంగానే !అంత బావున్నాయి మరి !

శరత్ కాలమ్ said...

బ్లాగ్స్పందన - మంచి ఆలోచన.

శ్రీలలిత said...

మీ ఆలోచన, ప్రారంభం అన్నీ బాగున్నాయి..

రాంగోపాల్ said...

సుజ్జి గారి కవితలు చాల చాల బాగుంటాయి. బ్లాగ్స్పందన చాల మంచి ఆలోచన.
మదుర గారు మీ ఆలోచనకి నా జోహారులు.

గీతాచార్య said...

సుజ్జి గారి కవితల్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, ఈబుక్ రూపంలో.

http://booksandgalfriends.blogspot.com/2010/03/b-ebooks-by-sujji.html

చాలా మంచి ప్రయత్నం మధుర వాణి గారూ. :-)

సిరి said...

బ్లాగ్స్పందన ? మంచి ఆలోచనే !! బాగుందండి ఇద్దరు బానే ఎలేస్తున్నారు మీ రాజ్యాన్ని

అక్షర మోహనం said...

స్పందన బావుంది.కొనసాగీంచండి.

భావన said...

బావుందండి బ్లాగ్స్పందన అనే ఐడియా. సుజ్జి గారి కవితలను మీ మనసున ముంచిన కలం తో చాలా బాగా పరిచయం చేసేరు. మంచి ఐడియా..

హరే కృష్ణ said...

మంచి ఆలోచన
మీ బ్లాగ్ చాలా బావుంది
మిస్ అయ్యాను

Kranthi M said...

నాది కాని లోకంలో

ఏ మనిషిని వెతకను..??

నీళ్ళు లేని సంద్రంలో

ఏ నావను నడపను..!!??

monne ekkaDo chadivAnu mallI parichayam renDU baGunnAyanDI.

హను said...

bagumdi anDi, mi visleashaNa

Narender said...

very nice

Anil kumar said...

nijamga chala bavunnayandi :)

Anonymous said...

అబద్ధంగా చాలా బాగాలేవండీ
నిజంగా అందంగా ఉన్నాయి