Monday, May 31, 2010

బ్లాగ్స్పందన - 'పిచ్చి' తల్లి ప్రేమ

'అమ్మ' అంటే ఉపోద్ఘాతం, వివరణ ఏదీ అవసరం లేని పదం. అమ్మ ప్రేమ, అమ్మ మనసు, అమ్మ గురించిన కబుర్లలో తీయదనం ఎంతని చెప్పలేం. ప్రపంచంలోని అమ్మలందరూ పూజ్యులే ఎందుకంటే, యీ సృష్టిలో ఉన్న ప్రతీ జీవి వెనుక ఓ అమ్మ ఉంటుందిగా మరి! అమ్మ గురించిన కబుర్లు ఎంత చెప్పినా, ఎంత విన్నా తనివి తీరదు. అమ్మ మనసు గురించి తెలుసుకున్న ప్రతీసారి మనసు ఆర్ధ్రమౌతుంది.


తల్లికి బిడ్డ మీదా, బిడ్డకి తల్లి మీదా ప్రేమ ఉన్నప్పటికీ యీ రెండూ ఒకలాంటివి కాదేమో! తల్లికి బిడ్డ మీదుండే ప్రేమకి అంతే ఉండదు. తన బిడ్డే తనకి ప్రపంచం. కానీ బిడ్డకి మాత్రం తల్లితో పాటు ఇంకా చాలా ప్రపంచం ఉంటుంది ;-) మా అమ్మమ్మ అంటుందీ.. తల్లి గర్భంలో జీవి ఎప్పుడైతే రూపు దిద్దుకుంటుందో అప్పటి నుంచి బిడ్డంటే తల్లికి తనలో ఒక భాగంగా బంధం పెనవేసుకుపోతుందట. తనకంటే తన బిడ్డే ఎక్కువ అన్న భావం బలపడిపోతుందట. కానీ, బిడ్డ మాత్రం తను సంపూర్ణంగా జీవం పోసుకున్నాక తల్లి పేగు తెంచుకుని పుట్టినప్పుడే ఆ బంధాన్ని తెంచుకుంటుందట. అంటే, బిడ్డకి చాలా సులువుగా తల్లిని వదిలి వెళ్లిపోగలిగే తెగింపు ఉంటుందిట. తనకి నచ్చినట్టు ఉండటం కోసం తల్లిని నొప్పించగలదు కూడా! కానీ, తల్లి మాత్రం ఏనాటికీ అలా చేయలేదుట. తనకెంత బాధ కలిగినా బిడ్డ సంతోషంగా ఉంటే చాలుననుకుంటుందట. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న తల్లులందరూ తమ పిల్లలపై పిచ్చిగా ప్రేమను పెంచుకుని జీవితాంతం తమ కంటికి రెప్పలా కాపాడుతారు.



'బ్లాగ్స్పందన' అంటూ ఇలా 'మాతృ ప్రేమ' గురించి నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే... 'నా రాతలు' అనే బ్లాగు రాస్తున్న స్ఫురిత గారు ఇటీవల 'పిచ్చితల్లి' అని ఓ పోస్టు రాశారు. తన బంగారు పాప ఇంట్లో లేకపోతే ఇల్లంతా, మనసంతా ఎంత వెలితిగా అనిపించిందో, ఎంత దిగులేసిందో చెప్పారు. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువూ, తను చేసే ప్రతీ పనీ, పాపనే ఎలా గుర్తుకు తెచ్చాయో స్ఫురిత గారు వివరించిన తీరు మనసుని హత్తుకుంటుంది.

తాత్కాలికమైన ఎడబాటైనా సరే పాప కళ్ళెదురుగా లేకపోతే ఎంత బెంగొచ్చేస్తుందో, మనసంతా తన చుట్టే ఎలా తిరుగుతూ ఉంటుందో, తన భావాల్ని ఎంతో హృద్యంగా చెప్పారు. పాప దూరంగా ఉంటే, తనెంత భద్రంగా ఉన్నాసరే, తల్లి మనసుకి మాత్రం ఎంత గాభరాగా అనిపిస్తుందో తెలియజెప్పారు. అంతే కాదు.. అమ్మ అయ్యాకే మన అమ్మ మన పట్ల చూపిన ప్రేమ బాగా అర్ధమౌతుందనీ, మన అమ్మ మన గురించి పడ్డ బాధంతా మనకి బాగా అనుభవంలోకి వస్తుందంటూ తన అనుభవాన్ని చాలా అందంగా రాసారు.

అందరి అమ్మల్లాగే కూతురిపై పిచ్చి ప్రేమని పెంచుకుని నేనూ మరో పిచ్చితల్లిని అయిపోయాయని స్ఫురిత గారు రాసిన వాక్యం మన కళ్ళనీ, మనసునీ కూడా తడిపేస్తుంది. ఓ అమ్మ మనసుని అద్దంలో చూపించిన ఆ టపా మొత్తం చదివేసరికి ఇదీ అని చెప్పలేని ఓ వింత అనుభూతి కలిగింది. అందుకే, యీ 'బ్లాగ్స్పందన' లో స్ఫురిత గారు రాసిన యీ పోస్టు గురించి ప్రస్తావిస్తున్నాం. ఎవరైనా మిస్సయ్యి ఉంటే, తప్పకుండా యీ పోస్టు చదివి మరోసారి స్వచ్చమైన అమ్మప్రేమని అనుభూతించండి.

-- సుజ్జీ & మధుర