Thursday, February 4, 2010

బ్లాగావరణంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న 'హాస్యాంజలి'

సందర్భానుసారం అందమైన మాటలు వాడే వారిని మాటకారి అంటాం. మనం కొంచం మాట మార్చి 'హాస్యాంజలి' బ్లాగర్ రాంగోపాల్ గారిని మంచి "బొమ్మకారి" అనాలేమో.!


ప్రతి హాస్యపు చణుకుకి యానిమేషన్ మెరుపును అద్ది అందించటం రాంగోపాల్ గారి ప్రత్యేకత అనొచ్చు. తెలుగు బ్లాగావరణంలో మొట్టమొదటి , ఏకైక యానిమేషన్ కామెడీ బ్లాగ్ గా 'హాస్యాంజలి'ని అనటంలో సందేహం లేదు.

బ్లాగులో అడుగు పెట్టగానే ఇది ఒక చక్కని యానిమేషన్ బ్లాగని మనకి వెంటనే స్ఫురిస్తుంది. దానిక్కారణం హాస్యాంజలి టైటిల్ తోనే ఉయ్యాల ఊగుతూ కనిపించే ఒక బుజ్జాయి, ఒక బుజ్జి పిల్లి , మరో పక్కన పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నుంచోడానికి ప్రయత్నించే యువకుడు (స్క్రోల్ బార్ యానిమేషన్).

నవ్వు బాధలను తరిమికొట్టే టానిక్. నవ్వడం అనేది మనిషికి మాత్రమే ఉన్న గొప్పవరం. అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి అనేదే తన ఆకాంక్ష అని.. అందుకోసం తను చేసే చిరు ప్రయత్నమే 'హాస్యాంజలి' బ్లాగ్ అంటారు రాంగోపాల్.


'హాస్యాంజలి' వయసులో మూణ్ణెళ్ళ పసిపాపే అయినా అప్పుడే దాదాపు ఎనభై పై చిలుకు హాస్యపు జల్లుల్ని తన ఖాతాలో వేసుకుంది. ఎక్కువ మంది దృష్టి లో కి రాకపోయినా, మూసధోరణిలో కాకుండా జోక్స్ ని కొత్తగా ఆవిష్కరించే వారి ప్రయత్నం నిజంగా అభినందనీయం. అందుకే హాస్యాంజలి తప్పకుండా చూడవలసిన బ్లాగే.

భార్యా భర్తలు, మొగుడు పెళ్ళాలు, పతీపత్ని, హజ్బెండు-వైఫు.. హీ హీ.. అన్నీ ఒకటే కదా అనుకుంటున్నారా..? ఒకటో కాదో ఆయా లింకుకెళ్ళి ఓసారి చూద్దురూ..! అవడానికి ఒకే అర్ధం అయినా టాపిక్ మీద ఎన్ని వందల వేల జోక్స్ పుడుతుంటాయో మనకి తెలిసిందేగా.! హాస్యాంజలి లో కూడా అలాంటి జోక్స్ చాలానే ఉన్నాయి.

చిన్నపిల్లల అమాయకత్వం చాలాసార్లు నవ్వుల పువ్వులు పూయిస్తుంది. మచ్చుకి ఇలాగన్నమాట 1,2,3,4. అలాగే, పేకాట హాస్యమైనా, అత్తగారి హాస్యమైనా దానికి సరిజోడైన యానిమేషన్ బొమ్మలు కలిపి నవ్వించేస్తుంటారు రాంగోపాల్ గారు.


కేవలం నవ్వించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తుంటారు మనందరికీ. కార్తీక పౌర్ణమి, క్రిస్మస్, బాలల దినోత్సవం, భోగి, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం.. పండుగేదయినా 'హాస్యాంజలి' లో శుభాకాంక్షలు మాత్రం యానిమేషన్ మెరుపులద్దుకుని మనల్ని మురిపించాల్సిందే.!


వారి అభిరుచికి తగినట్టు , వ్యక్తిత్వానికి అద్దం పట్టేట్టు , బ్లాగులను సృజించుకోవటం లో రాంగోపాల్ గారి ప్రయత్నానికి అభినందనలు తెలుపుతూ.. వారికి ఒక చిన్న కానుకగా లోగోని బహుకరిస్తున్నాం.!

P.S: బ్లాగు గురించి మేమిక్కడ చెప్పిన అభిప్రాయాలు మరే బ్లాగుతోనూ పోల్చి గానీ, లెక్కగట్టి గానీ చెప్పలేదనీ, కేవలం బ్లాగుని గురించిన మా అభిప్రాయాలను నిర్దిష్టంగా తెలియపరిచామని మనవి.

మళ్లీ మరో చక్కటి బ్లాగుతోనో, పోస్టుతోనో.. మరోసారి మీ ముందుకి వస్తాం.. అందాకా సెలవ్.!

-- సుజ్జీ & మధుర